Tuesday, November 3, 2009

తెలుగువాడు

కాళోజీ వారసుడా! కవితాతత్వ లాలసుడా
తెలుగు 'వాడి ' కి ఒరవు నీవు!తెలుగువాడినోర్వలేవు!
శ్రీశ్రీ కి ఛాయ వాడు ! చాయ్ లేనిదుండలేడు
సాఫ్ట్ వేర్ కింగ్ వాడు! చల్ల కదలకుండలేడు
కృష్ణశాస్త్రి చలం గార్ల మిర్రి మిర్రి చూస్తాడు
జాషువాను జాగ్రత్తగ నెత్తికెత్తుకుంటాడు
కందుకూరి కలలపంట కౌలుకిచ్చుకుంటాడు
గురుజాడ గురుపీఠం ఇంకొకరికి వదలలేడు
బాపిరాజుకెల్లప్పుడు బాసటగా నిలుస్తాడు
త్యాగయ్యను వీడలేడు తంబూరా మీటుతాడు
వేమన్న వెన్నంటిన వాడు వేయిప గలుగా సాగినాడు చూడు
రామదాసు కలిమి బలిమి రాగద్వేషాలకు కనలె కొలిమి
పోతన్నకు పంట వాడు తంటలేక ఉండలేడు
శ్రీనాధుని ఇంటివాడు సిరికందము తెచ్చువాడు
గంజాయిని సాగుచేయ గంపేడాశ చూపుతాడు
గండాలను దాటాలని గుండాలను మేపూతాడు
గాదె కింద పందికొక్కు కానకుండ ఒదులుతాడు
గోదావరి పరుగులోన గోదాములు నింపుతాడు
కృష్ణమ్మ ఉరుకులోనె కడుపు నింపు కష్టజీవి
నైజామును గద్దె దించె జమీందార్ల పనిపట్టె
అవశేషం మిగిలిందిక అవకాశం రావాలిక
గరికపాటి రాజారావు ఘనాపాటి గణనీయుడు
ప్రజాకళల ప్రజావళికి బాధ్యుడైన వైద్యుడు
శంకలేక స్పందించిన అంత:రంగ సూత్రుడు
వాస్తులోని వాస్తవమ్ము వాచిపోయి వాంతికొచ్చె
విషయంత్రము వీగిపోయి వెలుగుబాట ముందుకొచ్చె
ఖద్దరునొక ఊపుఊపి గద్దర్ గా కదలినాడు
ఖుద్దుగ తనకెందూ కుదురులేక నిలిచినాడు
ఖద్దరు నొక ఊపు ఊపి గద్దర్ గా కదిలినాడు
ఖుద్దుగ తనకెందూ కుదురులేక నిలిచినాడు
వాయిదాల పద్దతిపై అప్పులలో మునుగుతాడు
అప్పుమీద వడ్డీకై అప్పులనే తెస్తాడు
అప్పును తప్పనకుండా ముప్పులలో ఇరుకుతాడు
అప్పుచేసి పప్పుకూడు అందరికీ పెడతాడు
తెలివిలోన తేటజూపి కింగ్ మేకరౌతాడు
కొర్టులెంట తిరిగి తిరిగి కోతలెన్నో కోస్తాడు
వ్యాజ్యానికి రాజ్యానికి పొత్తు కుదరదంటాడు
గుడ్ బైలకు గుడ్ గై లకు ఘొల్లు ఘొల్లు మంటాడు
తెలంగాణ ఘల్లుమంటే ఝల్లు ఝల్లు మంటాడు
కలహాలకు సలహాలకు కరువులేదు అతనికి
యింటి గుట్టు చెప్పకుంటె నిద్రపట్టదతనికి
తెలుగువాన్ని సాచికొట్టు తెలివితేటలతనికి
పుట్టుకతో అబ్బినాయి ఎందుకోయి తనిఖి?
నలుగురితో నారాయణ అనలేడోయ్ అనలేడు
పేరుగొప్ప ఊరుదిబ్బ పెత్తనాలు చేస్తాడు
ఇంటిలోన పోరుపెట్టి ఇల్లెక్కి అరుస్తాడు
గల్లిలోనతానుండి ఢిల్లీకై కలగంటడు
గోతులుతీస్తూ తానే గోవిందుడనంటాడు
పీవిని రాజుచేసి పీకులాట పడతాడు
గోచిపెట్టుడొదలడు గోసపుచ్చుకుంటడు
గోత్రాలు లేనివాడు గోసాయిల కలవడు
అమెరికాయె ఆంధ్రయైన నాడు
తెలుగుభోజుడింటింటికి చూడు
విశ్వనాధు వీడలేడు విశ్వవీణ మోస్తాడు
శృంగారము మెచ్చుతాడు సింగారిగ మార్చుతాడు
కూచిపూడి కుర్రదాన్ని కూడబలుక్కుంటాడు
మధురవాణి గెలుచువాడు మారాజుగా కులుకుతాడు
మీనాక్షిని జలజాక్షిని మచ్చుకైన వదలడు
శృంగారమె కిర్రెక్కి కంగారై పోతాడు
లుబ్దావధాన్లకెపుడూ లబ్దికై నిలుస్తాడు
రామప్పంతులు ఇంట్లో రాట్నాలు వడుకుతాడు
గిరీశాన్ని మించినట్టి గింగిరీలు కొడతాడు
వరము వంటి ఘంటసాల ఒరవడినిట జూపినాడు
చాలు చాలు అనేవరకు బాలులా పాడతాడు
బాపు బొమ్మ గీస్తాడు పాపయ్యకు సాటి ఎవడు ?
సమరం వీడింటి వైద్యుడు గోరానిక జవదాటడు
కవిరాజును కౌగిలించ యింత 'తాపీ' నీకెందుకంట
శరత్ వాడి యింటల్లుడు దేవదాసే తోడల్లుడు
ప్రణాళికలు వేసి వేసి టక్కున దిగజారుతాడు
కరి మ్రింగిన వెలగపండు మాదిరిగా మారుతాడు
బిక్క మొహం వేస్తాడు బితుకు బితుకు మంటాడు
మొల్లనైన సరే సరే గిల్లకుండ వదలడు
దళితవాద ఉద్యమంతో దుమ్మురేగగొడతాడు
బహుజనులతొ సమ్మెక్కై బాహుబలం చూపుతాడు
మైనార్టీ కవిత్వంతో మతులే పోగొట్టుతాడు
మహబ్బతే: నడిపి నడిపి మహానగరు కట్టినాడు
గణపతి,పార్వతీశం, రేలంగిల కనుసన్నల నడిపి నడిపి
కనకధార, హాస్యరసం బేకబిగిన కురిపినాడు
టెక్నాలజి వాడి చెలిమ ,మేక్షగుండం పూడిపోదు
కరుణరసం వాడి చలువ , కాఠిన్యం చూపలేడు

నాగార్జునుడై జగతికి తత్వబోధ చేశాడు
మల్లినాధ సూరిగా వ్యాకరణం నేర్పాడు
వీరత్వం చూపినాడు కాకతీయనేలినాడు
రుద్రమాంబ కరవాలం భద్రంగా దాచినాడు
యుగంధరుని యుద్ధరీతి బ్రహ్మనాయుని సంఘనీతి
ఆకళింపు చేసుకొని కాలుదువ్వు శత్రువుల కాటికి పంపించినాడు
వెంకన్నకు గుండుకొట్ట అన్న మయ్య నెగేస్తాడు
అసమ్మతిని రాజేసి అందలాల నెక్కుతాడు
నన్నయ్యకు అన్నయ్యగ నాటకాలనాడతాడు
తిక్కన్నకు లేని తిక్క అంటగట్టి తీరతాడు
పెన్నానది పరవశంతో పెరుగన్నం వండినోడు
ప్రేగు మోత పెట్టగానే వలసదాసుడయ్యిండు
రాయలసీమ అయ్యయ్యో వలస సీమ అయ్యిందో!
నకనకలాడే కడుపుల కరువుల కాక హెచ్చిందో
పుట్టపర్తి ఇకలేడు ! వేమన్నా కనరాడు
వెంకన్నకు తిక్కెక్కువ అమెరికాకు పోతడేమొ
వెర్రివాడు రాముడొక్కడె ! ఎక్కడికీ పోడు
ప్రతి గుండెలో కొలువుంటడు వాల్మీకికి కాపుంటడు
భధ్రకాళి , దుర్గాంబ పైడితల్లి సమ్మక్క ఎల్లమ్మల మైసమ్మల
ఎల్లవేళ కొలుస్తాడు ఏకత్వం చూపుతాడు
దూబగుంట ఎల్లమ్మ గూబగుయ్యిమనిపిస్తే
గుబగుబలు పోయిండు గుద్దులు తన్నులు తిన్నడు
నమ్మకంగ ఏమార్చె ఇల్లంతా వరద కూర్చె
శ్రీహరికే కోటగట్టె ఆకాశాని కెగరబట్టె
యింట గెలిచి రచ్చగెలుపు సూత్రమ్మిట చెల్లదంట
పొరుగోడే పొగిడినాక మనవాడేనని చూడాలిక రొమ్ము విరుపు
కొరతవేసి కట్టుగట్టి చరిచి ఒక్క చరుపు
అడుగుతాడు చూపమని నీశక్తిని లేకుండా వెరపు
గోడు గోడు నేడ్చెటోడే తెలుగోడని తెలుసు
వెరపు లేక దూరతాడు అతి దగ్గరి మలుపు-

2 comments:

  1. తెలుగువాడు అని పేరు పెట్టి అర్ధం కాని బాష రాసారేమిటండీ?

    ReplyDelete
  2. శ్రీ శ్రీ గారూ
    మీరు చూసింది కొంత బాగం మాత్రమే .ఇప్పుడు పూర్తి కవితను పొందు పర్చడమైనది.మళ్ళీ ఒకసారి చూసి మీ విలువైన అభిప్రాయం తెల్పగలరు
    ఇట్లు
    సాహితీ మిత్రుడు
    కాసర్ల రంగారవు

    ReplyDelete