Friday, June 10, 2011

విశ్వ నరుడివి నువ్వే

విశ్వ నరుడివి నువ్వే


సీ విశ్వనరుడనని వివరించగా నీవు
గోరాతో వియ్యము గూడినావు
హేతువాద పటిమ హెచ్చెనట్లు తలచి
భావ విప్లవములు బహుళ హెచ్చె
అశ్వహృదయ నీదు హాసము చేతనె
శారదాంబ మదికి స్వస్థతిచ్చె
పద్మభూషణ నీకు పద్యమబ్బెను చూడ
పలుగాకులకు నోళ్ళు బందులయ్యె
తే:గీ: వివిధ రచనల చేతను విక్రమించ
వాణి ముద్దుల కొడుకుగ వాసికెక్క
చరిత మార్చిన వాడుగ చరితకెక్కి
గొప్పతనమునకు నిన్నిల గురుతు కొంద్రు

సీ: వచన కవితలని వాక్యాలు వ్రాసిరి
కవితలను ఖంగాళి కలిపినారు
భావపుష్టియు లేదు పద దృక్పథము లేదు
శబ్ద సౌందర్యమసలుగ లేదు
లేదు లేదనకుండ లిపివస్తేచాలని
బరికేది కవితలై పరువు నిడున
తెలుసుకొని తెలివి తెచ్చుకోవోయినీ
తెలుగు భాషకు సేవ తెలియపరచు


ఆ//వె// మాతృభాష వెలుగు మనిషికి తేజము
భాషలన్ని నీవు పరిగణించు
స్వంత భాష నీకు స్వాతిశయము కాద
తెలుగు కొరకు నీవు దీక్షగొనుము
మహాకవి జాషువా కవితా వైభవం : వార్షికోత్సవ (22) ప్రత్యేక సంచిక పేజి నె: 54 ; ఫిబ్రవరి 2011
పద్మభూషణ్ గుఱ్ఱం జాషువా స్మారక కళా పరిషత్
దుగ్గిరాల, గుంటూరు జిల్లా